Breaking News

పరిమితుల్ని ఎత్తివేసిన ఎయిర్‌టెల్‌ వొడాఫోన్‌ ఐడియా

Dec 08, 2019 05:27 by Admin Admin

మళ్లీ ఉచిత కాల్స్‌ వచ్చేశాయి. ప్రీ-పెయిడ్‌ మొబైల్‌ వినియోగదారుల కోసం భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా తమ కొత్త ప్లాన్లను సవరించాయి. అన్‌లిమిటెడ్‌ ప్లాన్లను కొనుగోలు చేసినవారికి అపరిమిత ఉచిత ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ అందుబాటులోకి వస్తాయి. ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీ ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ సదుపాయం ఉంటుంది. శనివారం నుంచే ఈ ప్లాన్లు అమల్లోకి వస్తాయని ఎయిర్‌టెల్‌ ప్రకటించగా, ఎలాంటి షరతులు ఉండవని స్పష్టం చేసింది. ఇక శుక్రవారం నుంచే మార్పులు వర్తిస్తాయని వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. ఈ మేరకు ఇరు సంస్థలు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాయి. 

ఇక ఈ సందర్భంగా రూ.219, రూ.399, రూ.449 ప్లాన్లను ఎయిర్‌టెల్‌ పరిచయం చేసింది. ఎయిర్‌టెల్‌ వివరాల ప్రకారం రూ.219 ప్లాన్‌ 28 రోజులపాటు వర్తిస్తుంది. ఇందులో అపరిమిత కాల్స్‌ (ఏ నెట్‌వర్క్‌కైనా), రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లుంటాయి. రూ.399 ప్లాన్‌ గడువు 56 రోజులు. అపరిమిత కాల్స్‌తోపాటు రోజుకు 1.5జీడీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లుంటాయి. రూ.449 ప్లాన్‌ కాలపరిమితి కూడా 56 రోజులే. అయితే ఇందులో అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లకుతోడు రోజు కు 2జీబీ డేటా వస్తుంది. ఎయిర్‌టెల్‌ తరహాలో వొడాఐడియా రూ.219 ప్లాన్‌ను తీసుకొచ్చింది. కాగా, ఔట్‌గోయింగ్‌ కాల్స్‌పై పరిమితి ఎత్తివేతతో ఎయిర్‌టెల్‌ రూ.399 కొత్త ప్లాన్‌.. జియో రూ.399 ప్లాన్‌ కంటే చౌక కావడం గమనార్హం. సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్‌)పై సుప్రీం కోర్టు తీర్పుతో టెలికం పరిశ్రమపై భారం పడిన విషయం తెలిసిందే. దీన్ని అధిగమించేందుకే ఆయా సంస్థలు చార్జీలను పెంచిన సంగతీ విదితమే.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe