హైదరాబాద్: తెలంగాణ పోలీసుశాఖ కొత్త రక్తంతో ఉరకలెత్తనుంది. ఒకేసారి దాదాపు 13 వేల మంది సిబ్బంది విధుల్లో చేరనున్నారు. శిక్షణ చివరి దశలో ఉన్న వీరందరికీ అక్టోబరులో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెల 7న కానిస్టేబుల్, 23న ఎస్సైలకు పరేడ్ జరపాలని భావిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఒకేసారి 17 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆ శాఖ శ్రీకారం చుట్టింది. నియామక ప్రక్రియ పూర్తిచేసి ఈ ఏడాది జనవరి నుంచి శిక్షణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. స్థలాభావం వల్ల 4 వేల మంది తెలంగాణ ప్రత్యేక పోలీసు పటాలం (టీఎస్ఎస్పీ) అభ్యర్థులకు మాత్రం ఇంకా శిక్షణ మొదలుకాలేదు. త్వరలోనే వీరికి కూడా శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
కరోనాను జయించి..
ఈ ఏడాది జనవరి నుంచి ఎస్సై, కానిస్టేబుళ్ల శిక్షణ మొదలైంది. ఆ తర్వాత మూడు నెలలకే కరోనా రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. అన్ని విద్యాసంస్థలను మూసివేయగా.. ఒక దశలో పోలీసు శిక్షణ కూడా ఆపాలని భావించారు. కానీ, ఈ శాఖ అవసరాల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే శిక్షణ కొనసాగించారు. ఈ క్రమంలో అనేక మంది కొవిడ్ బారినపడ్డప్పటికీ వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి శిక్షణ కొనసాగేలా చూశారు.
‘వేతనంతో కూడిన శిక్షణ ఇవ్వండి’
తమతోపాటు ఎంపికైన సివిల్, ఏఆర్ సిబ్బంది శిక్షణ పూర్తిచేసుకొని విధుల్లో చేరుతుండగా తమకు మాత్రం ఇంకా శిక్షణే మొదలు పెట్టకపోవడంతో సర్వీసులో వెనక్కి వెళ్తామని టీఎస్ఎస్పీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో కొందరు అభ్యర్థులు మంగళవారం హోంమంత్రి మహమూద్ అలీని కలిశారు. వేతనంతో కూడిన శిక్షణ ఇవ్వడంతోపాటు అదే రోజు నుంచి విధుల్లో చేరినట్లు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించాలని వారు హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు.