Breaking News

పాటే ఆయుధంగా.. May 23, 2016
పాటే ఆయుధంగా ప్ర‌త్యేక ఉద్య‌మంలో పాలుపంచుకున్నాడు... కొడుకు చ‌నిపోతే ఓ అమ్మ ప‌డే బాధ‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా పాట రూపంలో రాసి నంది అవార్డును గెలుచుకున్నాడు..ఇప్ప‌ట
పాటే ఆయుధంగా..

వెస్ర్ట‌న్ స్టైల్‌....

న‌న్ను నేను నిరూపించుకోవ‌డానికి వెస్ర్ట‌న్ స్టైల్‌లో న‌న్నుగ‌న్న త‌ల్లీ నా జ‌న్మ‌భూమి..నిన్ను మించిన దైవం నాకున్న‌దేమీ.. అంటూ పాట‌ను రాశాను. ఈ పాట రాసిన త‌రువాత చాలామందికి వినిపించాను. దీని గురించి చాలామంది హేళ‌న‌గా మాట్లాడారు.  వెస్ట్ర‌న్ జ‌నాల‌కు న‌చ్చ‌ద‌ని మ‌ళ్లీ మార్చ‌మ‌న్నారు. ఇదిలాఉండ‌గా ఒక‌రోజు క‌విత‌క్క నుంచి నాకు ఫోన్ వ‌చ్చింది.  బ‌తుక‌మ్మ‌కు సంబంధించిన పాట‌లు ఉంటే పంపించ‌మ‌ని ఆమె కోరారు. వెంట‌నే నేను నా ద‌గ్గ‌ర ఉన్న పాట‌ల‌ను అక్క‌కు మెయిల్ చేశాను. అదే రోజు క‌విత‌క్క నాకు ఫోన్ చేసి ఈ పాట చాలా బాగుంద‌ని న‌న్ను ప్రోత్స‌హించారు. నేను మ‌రుస‌టి రోజు క‌విత‌క్క‌ను క‌లిసిన‌ప్పుడు వెంట‌నే అక్క ఈ పాట‌ను రీ రికార్డింగ్ చేసి ఇవ్వాల‌ని దానికి సంబంధించిన ఖ‌ర్చుల నిమిత్తం చెక్కును రాసి ఇచ్చారు. కొన్ని అనివార్య కార‌ణాల  క‌విత‌క్కకు స‌మ‌యం దొర‌క్క‌పోవ‌డంతో వి6 చాన‌ల్  వారికి ఈ పాట‌ను వినిపించ‌డం.... వారు ఈ పాట‌ను ప్ర‌సారం చేయ‌డం జ‌రిగింది...

న‌న్ను నేను నిరూపించుకోవ‌డానికి...

మొద‌టి నుంచి తెలంగాణ పాట‌లు ఒకే బాణీలో ఉండేవి. త‌రానికి ఒక్కొక్క‌రూ ఒక్కొ ర‌క‌మైన ముద్ర‌ను వేసుకొని వ‌చ్చారు. గ‌ద్ద‌ర్ అన్న‌ది ప్ర‌త్యేక‌మైన శైలి. ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న శైలిలోనే చేయాల్సి ఉంటుంది. ఆయ‌న‌లాగే నాకు  ప్ర‌త్యేకంగా  శైలి ఉండాల‌నీ న‌న్ను నేను నిరూపించుకోవ‌డానికి న‌న్నుగ‌న్న త‌ల్లీ నా జ‌న్మ‌భూమి....పాట‌ను రాశాను. మొద‌ట ఈ పాట‌కు సంబంధించి ఒరిజిన‌ల్ వెర్ష‌న్లో ఉద్య‌మ నేప‌థ్యం ఎక్కువ‌గా ఉంటుంది. అలాకాకుండా తెలంగాణ‌లో పుట్టిన మ‌హానుబావుల గురించి ఉండాల‌న్న ఆలోచ‌న‌తో చివ‌ర‌లో ఈ పాట‌లో మార్పులు చేశాను. 

 సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్‌

ఈ పాట‌ను వి6 వారు ప్ర‌సారం చేసిన త‌రువాత సోష‌ల్ మీడియాలో ఈ పాట హ‌ల్‌చ‌ల్ చేసింది.  ఈ సంద‌ర్భంలోనే ఇంగ్లీషు దిన‌ప‌త్రిక‌కు చెందిన ఒక విలేఖ‌రి నాకు ఫోన్ చేశాడు. ఈ పాట గురించి నా గురించి అడిగి తెలుసుకున్నాడు. మ‌రుస‌టి రోజు పేప‌ర్ చూసేస‌రికి తెలంగాణ వాదాన్ని సొమ్ము చేసుకుంటున్న తెలంగాణ క‌ళాకారుల‌ని  ఈ పాట గురించి అత‌ను రాశాడు. నా యొక్క క‌థ‌నం ప‌క్క‌నే వేరే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ గ‌జ‌ల్ గాయ‌కుడిని పొగుడుతూ రాశాడు. ఇలా తెలంగాణ క‌ళాకారుల‌ను దెబ్బ‌కొట్ట‌డానికి అప్ప‌ట్లో కొంద‌రు ప‌నిగ‌ట్టుకొని ప్ర‌చారం చేశారు.

ఓయూ నేప‌థ్యం గురించి....

ఓయూ నేప‌థ్యం గురించి ఓ పాట రాశాను...ఓ యుద్దం పుడితే ఓయు నిలువుట‌ద్దం ప‌ట్టేరా...ఆ యుద్దంలో ప్ర‌తి విద్యార్థి ప్ర‌తిబింబం ఆయేరా...క్యాంప‌స్ గోడ‌లే బందీఖానాయే...ఖాకీ, తుపాకీ చుట్టూ గోడై కాప‌లా కాస్తూ ఉన్నాగానీ.... ఆగ‌ని ఆరాటం... అది చేసేరా పోరాటం....హాస్ట‌ల్ మెస్‌కు తాళం వేసి..తాగే నీళ్ల‌ను క‌ట్ట‌డి చేసి నానా హింస‌లు పెట్టిన గానీ వీడ‌ని వీర‌త్వం మ‌న విద్యార్థి త‌త్వం..అంటూ రాసిన పాట అప్ప‌ట్లో విద్యార్థుల్లో ఉత్తేజం నింపింది.

ఈ పాట‌కు నంది అవార్డు వ‌చ్చింది...

రాతిబొమ్మ‌లోన కొలువైన శివుడా...ర‌క్తబంధం విలువ‌ నీకు తెలియ‌దురా..నుదుటి రాత‌లు రాసే ఓ దేవ‌దేవ‌...త‌ల్లీ మ‌న‌సు ఏమిటో నీవు ఎరుగ‌వురా....  ఈ పాట‌ను నేను చ‌నిపోయిన శ్రీ‌కాంత‌చారి గురించి రాయ‌లేదు. 2004 సంవ‌త్స‌రంలో ఒక ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఆ ఎన్‌కౌంట‌ర్‌లో శంక‌ర్ అనే వ్య‌క్తి చ‌నిపోయాడు. అత‌నికి మావోయిస్టుల‌తో ఎలాంటి సంబంధాలు లేవని, అనుమానంతోనే ఎన్‌కౌంట‌ర్ చేశార‌ని శంక‌ర్ త‌మ్ముడు  నా ద‌గ్గ‌రకు వ‌చ్చితెలిపాడు. మా అన్న చావు మీద‌, మా అమ్మ దుఃఖం మీద ఒక పాట‌ను రాయ‌మ‌ని చెప్పి వాళ్ల‌ ఇంటికి న‌న్ను తీసుకెళ్లాడు. నేను వాళ్ల ఇంటికి వెళ్లిన‌ప్ప‌డు వాళ్ల  అమ్మ‌ ప‌డిన బాధ‌ను, ఆవేద‌న‌ను చూసి చ‌లించిపోయి ఈ పాట‌ను రాశాను. త‌ద‌నంత‌రం ప్ర‌త్యేక‌ ఉద్య‌మంలో భాగంగా  కేసీఆర్‌గారు ఈ పాట‌ను విని చ‌నిపోయిన శ్రీ‌కాంత‌చారి అనుగుణంగా రాయ‌మ‌ని న‌న్ను కోరారు. ఇలా ఈ పాట‌ను పోరు తెలంగాణ సినిమాలో సైతం వాడుకున్నారు. ఈ పాట‌కు నంది అవార్డు వ‌చ్చింది.

మిలీనియం మార్చ్ సంఘ‌ట‌న‌పై

మిలీనియం మార్చ్ సంద‌ర్భంగా నేర్నాల కిషోర్‌, ర‌మాదేవి అనే గాయ‌కులిద్ద‌రిని పోలీసులు దారుణంగా కొట్టారు. వారి ప‌రిస్థితిని చూసి నేను చాలా ఆవేద‌న చెందాను. ఆవేద‌న‌ల నుంచే ఒక పాట పుట్టింది.....ఆట‌,పాట‌ల‌కు సంకెళ్లేస్తే ఆగ‌దు పోరాటం..అదివంచిన కొద్దీ ముంచుకు వ‌చ్చే ఉప్పెన సిద్ధాంతం..డ‌ప్పు డోలు గొంతులు మూస్తే ఆగ‌దురా యుద్ధం...నీ చెర‌సాల్లోనే కంచెం మీద చేస్త‌ది రాద్దాంతం..ట్యాంక్‌బండ్ మిలీనియం మార్చ్‌లో నీతినిండి ఉందిరా...మీరు నీతి లేని వారురా...అందుకే మా అన్న‌ద‌మ్ముల‌ను అడ్డ‌గించి కొట్టినారురా..విగ్ర‌హాల‌పై ఆగ్ర‌హానికి అర్థ‌మెంత ఉందిరా..మీరు అర్థ జ్ఞానులేనురా....అందుకు మా ఆడ‌బిడ్డ‌ల మీద దాడి చేసినారురా....

ర‌చ‌యిత‌గానే ఇష్టం...

నాకు అన్ని ర‌కాల పాట‌లు రాయ‌డంమంటే ఇష్టం..జాన‌ప‌దం, జ‌న‌ప‌థం, విప్ల‌వ‌, చైత‌న్య‌, భ‌క్తికి సంబంధించిన‌ గీతాల‌తో పాటు సినిమాల‌కు సైతం పాటలు రాశాను. నాకు గాయ‌కుడిగా కంటే ర‌చ‌యిత‌గానే ఎక్కువ ఇష్టం. ఇప్ప‌టివ‌ర‌కు 15 పాట‌ల‌ను పాడాను. రాజ‌న్న‌, ధైర్యం, అనఅన‌గా ఒక చిత్రం, పోరు తెలంగాణ, నాన్‌స్టాఫ్‌, స‌త్యాగ్ర‌హి త‌దిత‌ర‌ చిత్రాల‌కు నేను పాటలు రాశాను. 

సంతోష్ గారి నుంచి ఫోన్ వ‌చ్చింది...పాట అలా బ‌య‌ట‌కు వ‌చ్చింది..,.

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌పై పాట రాసే అదృష్టం రావ‌డం నాకు సంతోషం క‌లిగించింది. అది ఎలా అంటే..సెప్టెంబ‌ర్ 30వ తేదీ 2014వ రోజున కేసీఆర్ నాతోపాటు  6గురు ర‌చ‌యిత‌ల‌ను ఇంటికి భోజ‌నానికి పిలిచారు. క‌ళాకారుల‌కు ఉద్యోగాలు ఇస్తే ఎలా ఉంటాయి..ఎవ‌రెవ‌రు ఉద్య‌మంలో తిరిగారు.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఎలా ఉంటాయి.. చేయ‌బోయే ప‌నులు ఎలా ఉండాలి...ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు అందే విధంగా ఎలా ర‌చ‌న‌లు ఉండాల‌న్న దానిపై చ‌ర్చ‌లు జ‌రిగాయి..దానికి సంబంధించిన విష‌యాల‌ను సీఎంగారు చెబుతున్న‌ప్ప‌డు మేము రాసుకుంటున్నాం. ఆ సంద‌ర్భంలో నా పెన్నులో ఇంకు అయిపోయింది. ఇది గ‌మ‌నించిన సీఎం కేసీఆర్ ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్న పెన్నును నాకు ఇచ్చారు. ఈ పెన్నుతో ఏదైనా మంచి క‌విత‌ రాయాల‌న్న ఉద్దేశ్యంతో దానిని  జేబులో పెట్టుకొని దేశ‌ప‌తి శ్రీ‌నివాస్ గారి దగ్గ‌ర ఉన్న పెన్నుతో రాసుకున్నాను.  సీఎం ఇచ్చిన  పెన్ను చూసిన‌ప్పుడ‌ల్లా ఏదైనా నాకు రాయాల‌నిపించేది. ఈ సంద‌ర్భంలోనే టీ న్యూస్ ఎండీ సంతోష్ గారు నాకు ఫోన్ చేసి సీఎం బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఒక పాట రాయ‌మ‌ని న‌న్ను కోరారు. దీంతో అలా పాట‌ను రాసి కేసీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేశాం.

కేసీఆర్ అంటే అభిమానం 

ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొద‌టి నుంచి ప్ర‌త్యేక తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశారు. అంద‌రితో మాట‌లు ప‌డ్డారు. ఎన్నో ఎదురుదెబ్బ‌లు తిన్నారు. అనుకున్న‌ది సాధించారు. అందుకే ఆయ‌నంటే అభిమానం. 

ఒక్కో ఊరిలో ఒక్కో క్లాసు...

చ‌దివింది 9 త‌ర‌గ‌తి. గోదావ‌రి ఖ‌నీ, వ‌రంగ‌ల్‌, మంద‌మ‌ర్రి, మంచిర్యాల‌, వావిలాల‌, కుంద‌న‌ప‌ల్లి ఒక్కో ఊరిలో ఒక్కో క్లాసు చ‌దివాను. 2004 నుంచి నా ర‌చ‌నలు ప్రారంభ‌మ‌య్యాయి. నా మొద‌టి పాట న‌వ‌మాసాలు మోసిన త‌ల్లీ ప్రేమ‌కే నే దూర‌మా.... మొద‌ట నాలో ర‌చ‌యిత ఉన్నాడ‌ని గుర్తించింది మా పెద్ద‌మ్మ కొడుకు న‌వీన్‌.

నా ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బులు పోయాయి

సినిమాలో పాటలు రాయ‌డానికి సాన యాదిరెడ్డి (నిర్మాత‌)ను క‌ల‌వ‌డానికి మొద‌ట హైద‌రాబాద్ వ‌చ్చాను. ఆ సంద‌ర్భంలో వ‌ర్షం ప‌డుతుంది. విద్యాన‌గ‌ర్ బ‌స్టాప్‌లో రేకుల‌షెడ్డు కింద ప‌డుకున్నాను. ఈ సందర్భంలో నా ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బులు పోయాయి. దీంతో నేను చాలా ఇబ్బంది ప‌డ్డాను. ఉద‌యం వ‌ర‌కు ఆ షెడ్డు కిందే ప‌డుకొని సీతాఫ‌ల్‌మండిలో ఉండే మా స్నేహితుడి ఇంటికి న‌డుచుకుంటూ వెళ్లి అత‌ని ద‌గ్గ‌ర దారి ఖ‌ర్చుల నిమిత్తం డ‌బ్బులు తీసుకొని ఇంటికి వెళ్లిపోయాను.

ఇద్ద‌రూ రెండు క‌ళ్ల లాంటి వారు

ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌, గ‌ద్ద‌ర్‌ నాకు రెండు క‌ళ్ల లాంటి వారు. సినిమా పాట‌ల ర‌చ‌యిత‌లో వేటూరి, చంద్ర‌బోస్ లు,  జ‌నం పాట‌లు రాసే వారిలో గోర‌టి వెంక‌న్న‌, అందెశ్రీ‌, జ‌య‌రాజ్ గారంటే ఇష్టం. 

అబ్బాయిల‌తో పాటు అమ్మాయిల త‌ప్పు 

చెల్లీ నీ ఆడ‌జ‌న్మ‌కు ఓ చ‌రిత ఉన్న‌ద‌మ్మా... అనే పాట రాయ‌డానికి కార‌ణం వ‌రంగ‌ల్‌లో ఓ అమ్మాయిపై యాసిడ్ దాడి జ‌రిగింది. దీంతోపాటు విజ‌య‌వాడ‌లో కూడా ఇలాంటి సంఘ‌ట‌న మ‌రొక‌టి జ‌రిగింది. వారి గురించి చ‌దివి ఈ పాట‌ను రాశాను. అబ్బాయిల‌తో పాటు అమ్మాయిల త‌ప్పు కూడా ఉంద‌ని తెలుపుతూ ఈ పాట‌ను రాయాల్సి వ‌చ్చింది.

 మాది చాలా చిన్న కుటుంబం. 

మాది చాలా చిన్న కుటుంబం. నాకు ఇద్ద‌రు అక్క‌లు, ఒక అన్న‌. మాది ప్రేమ వివాహం. ప్రకృతి, చేత‌న్ శ్రీ‌రామ్ లు ఇద్ద‌రు సంతానం మాకు.   

 

 

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe